తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా !
‘
“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అని మనసా వాచా కర్మణా నమ్మిన మహానుభావుడు ఎన్టీఆర్ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సృష్టించిన విప్లవం తెలుగుదేశం పార్టీ. 1983లో దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించే అడుగులతో ప్రారంభమైన పార్టీ నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా ప్రజా శ్రేయస్సు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉంది. అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అన్నది తెలుగుదేశం పరిశీలనలో ఎప్పుడూ ఉండదు. ప్రజలకు అండగా ఉన్నామా లేదా అన్నదే కొలమానంగా రాజకీయం చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ రంగంలో వచ్చిన మార్పులు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేతలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ బలంగా ఎదిగారు. పంచాయతీల నుంచి ప్రజల్లో బలమైన నేతలుగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎదిగేలా అవకాశం కల్పించింది తెలుగుదేస పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో అయినా .. ఇప్పుడు ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా ఏ పార్టీలో బలహీన వర్గాలను చూస్తే సగానికిపైగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన వారే ఉంటారు. తెలుగు రాజకీయ చరిత్రలో ఇదే టీడీపీ బడుగు, బలహీన వర్గాల కోసం వేసిన ముద్ర.
అధికారం అందని వర్గాలకు అధికారం అందించే విషయంలోనే కాదు సంక్షేమం, అభివృద్ది విషయంలో టీడీపీ చేసిన కృషి ఎవరూ చెరిపేయలేనిది. నాడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలోబియ్యం స్కీమ్ ఇప్పటికీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మారిపోయినా ఆ స్కీమ్ జోలికి రావడానికి ఏ ప్రభుత్వమూ సాహసించలేరు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు సంక్షేమానికి కొత్త అర్థం చెప్పాయి. ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమ రాజకీయాల్లో టీడీపీ తనదైన ముద్ర వేసింది.
1994 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రానికి స్వర్ణయుగం. ఓ సైబరాబాద్ పురుడు పోసుకుంది. పేదలకు సాంకేతిక విద్య కోసం ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. రైతుబిడ్డలు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేయాలన్న లక్ష్యంతో టీడీపీ నాయకత్వం పని చేసింది. నేడు లక్షల రైతు బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ నిపుణులుగా ఉన్నారు. ఒక్క పాలసీ ప్రజల జీవితాల్ని ఎలా మారుస్తుందనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. రాజకీయాలు, రాజకీయ ఫలితాలు అనూహ్యమైనవి. గెలుపోటములు సహజం. ఓట్లు వేయడానికి ప్రజలు అభివృద్ధిని లేదా సంక్షేమాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం లేదు. ఈ క్రమంలో టీడీపీ కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా లక్షలాది మంది తెలుగు ప్రజల మద్దతుతో ఎప్పటికప్పుడు పసుపు జెండా సగర్వంగా ఎగరేస్తూనే ఉంది.
గతంతో పోలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. రాజధాని లేదు. పోలవరం ఆగిపోయి ఐదేళ్లయింది. మౌలిక సదుపాయాల్లేవు. ఇసుక, మద్యం పేరుతో ప్రజల్ని దోపిడి చేస్తున్నారు. ఉపాధి లేక లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ప్రాణాలకు తెగించి అయినా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. జన్మభూమి అనే భావన మదినిండా పెట్టుకున్న తెలుగువాళ్లు ప్రపంచం మొత్తం కనిపిస్తారు. వారందరికీ ఇదే విన్నపం రండి.. తెలుగుదేశంతో కలిసి రండి. మన రాష్ట్రాన్ని మన మాతృభూమినిి కాపాడుకుందాం. సైకోల నుంచి ప్రజల్ని కాపాడుదాం.. మన రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా మార్చుకుందాం..!